కథా మార్గం కస్తూరి విజయంసుధీర్ రెడ్డి పామిరెడ్డి 'తిరగబడ్డ ఉచ్చు' వివాహ కథా వేడుక కథలన్నీ నలుగురూని చదివేలా చేస్తాయి. ఆలోచింపజేస్తాయి. ఈ కథల్లోని మలుపులు, మెలికలు, సుఖాంతాలు, దుఃఖాంతాలు రూపంగా పాఠకుల మీద చెరిగిపోని ముద్ర వేస్తాయి. సమాధానాలు వెదుక్కోటానికి అవసరమైనంత సమాచారాన్ని పాఠకుడికి ఇస్తాయి. సత్యానికి దారి చూపిస్తాయి. మెదడు కుడి భాగం సృజనాత్మకతకి పేరు పొందితే ఈ కథలన్నీ కథ నిర్మాణం లోని కథనం, సంభాషణలు, పాత్ర చిత్రణ, శైలి కేంద్రంగుండా కళా సృజన చేస్తూ సాగటం విశేషాంశం. ఈ కథలు చదివితే పెళ్ళి పట్ల అవగాహన పెరుగుతుంది. పెళ్ళి బంధంలో చిక్కుముడులన్నీ విడిపోతాయి. బంధంలో గొప్పదనం పై సహానుభూతి మొదలవుతుంది. నేటి పెళ్లిళ్ల సమస్య లోతు తెలుస్తుంది. వాటి పరిష్కార మార్గాలపై అంచనా వస్తుంది. ఈ పాత్రలు అపనమ్మకం, నింద, భాగస్వామి విలువ తెలుసుకోలేకపోవడం వంటి సమస్యల నుండి ఎలా బయటపడ్డాయే తెలుస్తుంది.ప్రతి కథ ఉద్దేశపూర్వకంగా ఎడిటర్ దృష్టిని ఆకట్టుకోటానికి ప్రయత్నిస్తుంది. సంపాదకులు, పామిరెడ్డి పద్మజ, వంగిపురపు హిమాబిందు కథ ఆసాంతమూ చదివించగలదనే నమ్మకమొచ్చాక మాత్రమే కథను ఎన్నుకున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఎన్ని తిప్పలయిన పడి అతి తక్కువ సమయంలో వీరి ఇరువురి కృషి పట్టుదలతో ఈ ' 'తిరగబడ్డ ఉచ్చు' వివాహ కథా వేడుకను సంతోషంగా ఒడ్డుకు చేర్చారు. వీరి సాహితి సంకల్పానికి కృతజ్ఞతలు.