స్వతహాగా నేను రచయితను కాను. కాకపోతే ఎంతోకొంత రచయితలతో సాంగత్యం కలిగిన వాణ్ణి. అప్పుడప్పుడు ముఖ పుస్తకంలో పోస్టింగ్ లప్పుడు రెండు, మూడు లైన్లు రాయడమే గగనంగా ఉండేది. దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఒక్కసారిగా ఆలోచనలు చుట్టుముట్టాయి. గడపదాటని పరిస్థితుల్లో కోట్ల రూపాయల వ్యాపార,వ్యవహారాలు స్తంభిస్తాయి. ఎలా? సమస్య జటిలం. దీన్ని అధిగమించి జీవనయానం పదిలం చేసుకోవాలంటే ఆలోచన మారాలి. ఈ టెన్షన్ నుండి బయటకు రావాలి. ఎలా స్వామీ, ఏమి చేయను? అని ఒక దండము పెట్టేసా. అప్పుడే స్వామి నుండి పిలుపు. గది తలుపులు మూసి, మది తలుపులు తెరువమని. అంతే మనసు గతం వైపు తొంగి చూసింది. రాస్తున్నా.. రాసేస్తున్నా. నన్ను నేను మరిచి పోయి గతం నుండి ప్రస్తుతం వరకు ఎన్నో సంఘటనలు. ఎన్నో మలుపులు. ఎన్నో గెలుపులు, ఎత్తుపల్లాలు, కష్టనష్టాలు, సుఖదుఃఖాలు. రాయడం, ఫేస్ బుక్, వాట్సాప్ లలో తెలిసిన వాళ్ళకి పెట్టడం. దీనితో ప్రాజెక్టు టెన్షన్ మరచిపోయేలా చేశారు స్వామి. అలా నా స్వీయచరిత్ర ను ""రంగాంతరంగం"" పేరుతో అక్షరీకరించగలిగాను. ఇది నా తొలి రచన. స్వామి మహిమ కాక మరేమిటి. స్వామి నన్నో చిన్న రచయితను చేశారు. తదుపరి అనుకోకుండా స్వామి గురించి తెలుసుకుందాం అని ప్రయత్నం. ఎందుకో రాస్తూ ఉన్నాను. తెలియకుండా ద్వారకాధీశా నమో నమః అని పుస్తకం పేరూ పెట్టేసా. అలాగే అనేక విషయాలు రాసేసానా, రాయించారా, ఏమో? స్వామి భక్తులు ఎంతో మంది రచయితలు ఉన్నారు. కానీ అక్షరం రాని వాడితో రాయించుకుందాం అనుకున్నారేమో. మీ.. మాటూరి రంగనాధ్